Skip to main content

ఇది చాలా మంచి వ్యాసం. అందరూ తప్పక చదవాలని మనవి.

ఇది చాలా మంచి వ్యాసం. అందరూ తప్పక చదవాలని మనవి.

త్వమేవాహమ్‌

* కన్నతల్లి కడుపులోంచి బయటపడి, తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి, పుడమితల్లి కడుపులోకి చేరుకునేందుకు ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా సాగే ప్రస్థానం పేరే నేను

ఈ *నేను ప్రాణశక్తి అయిన ఊపిరికి మారుపేరు

* ఊపిరి ఉన్నంతదాకా నేను’ అనే భావన కొనసాగుతూనే ఉంటుంది

 * జననమరణాల మధ్యకాలంలో సాగే జీవనస్రవంతిలో ఈ నేను ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలూ చేస్తుంది

ఈ *నేను లోంచే నాది అనే భావన పుడుతుంది!

ఈ *నాది లోంచి నావాళ్ళు, నాభార్య, నాపిల్లలు, నాకుటుంబం, నాఆస్తి, నాప్రతిభ, నాప్రజ్ఞ, నాగొప్ప... అనేవీ పుట్టుకొచ్చి చివరికి ఈ నేను అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి,ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి అహం గా ప్రజ్వరిల్లుతుంది
* అహం అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో ఈ నేను  నేనే సర్వాంతర్యామిని అని విర్రవీగుతుంది.
*నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుంది
*పంతాలతో పట్టింపులతో, పగలతో ప్రతీకారాలతో తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీ సిద్ధపడుతుంది

* బాల్య, కౌమార, యౌవన, వార్ధక్య దశలదాకా విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన నేను అనే ప్రభ ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది.
*వందిమాగధులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది.
*సుందరీమణులతో మదనోత్సవాలు జరుపుకొన్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది.
* సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన నేను చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది.
*కడసారి చూపులకోసం, కొన్ని ఘడియలపాటు ఆపి ఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.
*మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.
*మొలకుచుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, మొత్తంగా కాలి బూడిద అవుతుంది.

* నేనే శాసన కర్తను, నేనే ఈ భూమండలానికి అధిపతిని, నేనే జగజ్జేతను... అని మహోన్నతంగా భావించిన నేను లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది. రోజు మారుతుంది.

ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన *నేను కథ అలా సమాప్తమవుతుంది.

* అందుకే ఊపిరి ఆగకముందే నేను గురించి తెలుసుకో అంటుంది భగవద్గీత.

* చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది శ్మశానవైరాగ్యం మాత్రమే.
*అది శాశ్వతం కానే కాదు.
* నేను గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే, పరిపూర్ణమైన వైరాగ్యస్థితి సాధ్యమవుతుంది.

* వైరాగ్యం అంటే అన్నీ వదిలేసుకోవడం కానేకాదు. దేనిమీదా మోహాన్ని కలిగి ఉండకపోవడం.  తామరాకుమీద నీటి బొట్టులా జీవించగలగడం.

*స్వర్గ నరకాలు ఎక్కడో లేవు. మనలోనే ఉన్నాయి.

* మనిషికి, ఆత్మదృష్టి నశించి బాహ్యదృష్టితో జీవించడమే నరకం
* అంతర్ముఖుడై నిత్యసత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడమే స్వర్గం
* ఈ జీవన సత్యాన్ని తెలియచేసేదే వేదాంతం.

* నిజాయతీగా, నిస్వార్థంగా, సద్వర్తనతో, సచ్ఛీలతతో భగవత్‌ ధ్యానంతో జీవించమనేదే వేదాంతసారం.

అహం బ్రహ్మాస్మి అంటే
అన్నీనేనే అనే స్థితి నుంచి త్వమేవాహమ్‌ అంటే- నువ్వేనేను అని భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకోగల తాదాత్మ్య స్థితిని చేరుకోగలిగితేనే మానవజన్మకు సార్థకత.

Comments

Popular posts from this blog

64 కళలు ( విద్యలు ) అంటే ?

64 కళలు ( విద్యలు ) అంటే ? మన భారతీయ సంస్కృతిలో 64 కళలు ను తెలియజేసే శ్లోకం వేద వేదాంగేతిహాసాగమ, న్యాయకావ్యాలంకార, నాటక, గాన కవిత్వ కామశాస్త్ర శకున, సాముద్రికారత్న పరీక్షాస్వర్ణపరీక్షా శ్వలక్షణ, గజలక్షణ, మల్లవిద్యా, పాకకర్మ దోహళ గంధవాద ధాతువాద ఖనీవాద, రసవాదాగ్నిస్తంభజలస్తంభ వాయుస్తంభ ఖడ్గస్తంష, వశ్యాకర్షణ మోహన విద్వేషణోచ్ఛాటన మారణ కాలవంచన వాణిజ్య, పాశుపాల్య కృష్యా సవకర్మలావుక యుద్ధమృగయా, రతికౌశలా దృశ్యకరణీద్యూతకరణీ చిత్రలోహ పాషాణ మృద్దారు వేణు చర్మాంబరక్రియా చౌర్యౌషధసిద్ధి స్వరవంచనా దృష్టివంచనాంజన, జలప్లవన వాక్సిద్ధి, ఘటికాసిద్ధి, ఇంద్రజాల మహేంద్రజాలాఖ్య చతుష్టష్టివిద్యా నిషద్యాయమాన నిరవద్య విద్వజ్ఞాన విద్యోతితే. అర్థము: 1. వేదములు (ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అధర్వణవేదము అను నాల్గు) 2. వేదాంగములు ….శిక్షలు, వ్యాకరణము , ఛందస్సు , జ్యోతిషము , నిరుక్తము , కల్పములు అని వేదాంగములు ఆరు శాస్త్రములు 3. ఇతిహాసములు …. రామాయణ,మహాభారత, భాగవతం పురాణాదులు 4. ఆగమశాస్త్రములు …. శైవాగమము ,పాంచరాత్రాగమము , వైఖానసాగమము ,స్మార్తాగమము అని ఆగమములు నాలుగు . 5. న్యాయము …..తర్కశాస్త్రమునకు పేరు 6. కావ్యాల...

ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో

ఎక్కడ మనసు నిర్భయంగా వుంటుందో ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో సంసారపు గోడలమధ్య ఎక్కడ భాగాలకింద ప్రపంచం విడిపోలేదో ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో ఎక్కడ అలసట నెరగనిశ్రమ తనబాహువుల్ని పరిపూర్ణతవైపు జాస్తుందో ఎక్కడ నిర్జీవమైన ఆచారపు టెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా వుంటుందో ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకీ కార్యాలలోకీ నీచే నడపబడుతుందో ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రీ నాదేశాన్ని మేల్కొలుపు. PAKALAPATI AMARNADH

గణతంత్ర దినోత్సవం

మిత్రులకు ముందుగా “గణతంత్ర దినోత్సవ” శుభాకాంక్షలు... నిన్న “N - న్యూస్” అనే చానల్ సర్వే చేసిన వీడియో ఒకటి చూసాను.. ఆ సర్వే ఏంటంటే అసలు “గణతంత్ర దినోత్సవం” అంటే ఏంటి ?? ఈ విషయాన్ని ఎంతమంది విద్యార్ధులు చెప్తారు ?? నిజానికి ఆ వీడియో చూసాక ఎవరైనా ఓ డబల్ బ్యారల్ గన్ తీసుకుపోయి ఆ సమాధానాలు చెప్పేవాళ్ళను కాల్చిపారేయ్యాలనిపిస్తుంది .. ఒకడేమో జనవరి 26 ప్రేమికుల రోజు అంటున్నాడు.. ఇంకొకరేమో జనవరి 26 గాంధీ జయంతి అంటున్నారు.. మరొకరేమో జనవరి 26 హాలిడే కాబట్టి ఎంజాయ్ చేసే రోజు అంట.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా చాలా దారుణంగా సమాధానాలు ఇస్తుంటే .. నిజంగా వీళ్ళు మన భారతీయులేనే ?? అనిపిస్తుంది ... ఇదేనా మనం గొప్పగా చూస్తున్న సువిశాల భారతదేశం ... అంతెందుకు ఇది చదువుతున్న మీరే మీ మనసాక్షిని అడగండి.. ఎంతమందికి “గణతంత్ర దినోత్సవం” అంటే ఏంటి ?? అన్న విషయం తెలుసు.. ఒక సినిమాకు ఇచ్చే విలువ కూడా మనం మన దేశానికి ఇవ్వలేకపోవడం శోచనీయం.. స్కూల్స్ లో “గణతంత్ర దినోత్సవం”నాడు జెండా పట్టుకొని, చాక్లెట్స్ తీసుకొని, కాసేపు గీతాలు పాడుకొని, ఏవైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ వుంటే అవి చూసి ఇంటికి రావడమే మనం తెలుసుకున్నాం.. ఆ స్కూల్స్...